17 భాషలు మాట్లాడగల నేర్పరితనం కలిగిన నాయకుడు, భారతదేశ గమనాన్ని మార్చివేసిన మేధావి పీవీ. ఆయన మన తెలంగాణ బిడ్డ కావడం తెలంగాణ వాదులుగా గర్వించదగ్గ విషయం. పీవీ నరసింహారావు1921 జూన్ 28వ తేదీన వరంగల్ జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో జన్మించారు. పీవీ ప్రాథమిక విద్యాభ్యాసం వరంగల్ జరిగింది. ఆ తదుపరి ఉన్నత చదువుల కోసం హైదరాబాద్‌కు వెళ్లారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నేర్పించిన పాఠాలతోనే నరసింహారావు ప్రధాని కాగలిగారు అనడంలోసందేహం లేదు.
1971 సెప్టెంబర్ 30న కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల తెలంగాణ ప్రాంతవాసికి ముఖ్యమంత్రి పదవిని ఇవ్వవలసిన పరిస్థితి ఏర్పడింది. అటువంటి సందర్భంలో ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన పీవీ నరసింహారావు బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి అనేక సవాళ్లను ఎదుర్కొన్నాడు. ఆనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
భూ సంస్కరణల విధానాన్ని రాష్ట్రంలో అమలు పరచడంతోపాటు, ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీని ఒప్పించి భూ సంస్కరణల విధానం దేశం మొత్తం అమలయ్యేవిధంగా కృషి చేయడంలో విజయం సాధించాడు.
నరసింహారావు తన కార్యక్రమాలను బాగా ప్రచారం చేసి ఉండకపోవచ్చు. కానీ, చాలా మందికి తెలియని విషయం ఏమంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలలో సామాజిక న్యాయం భావనను ప్రవేశపెట్టిన మొదటి వ్యక్తి పీవీయే అని చెప్పవచ్చు. తాను ఇన్చార్జిగా ఉన్న రాష్ట్రాలలో జరిగిన ఎన్నికలలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు దాదాపు 70 శాతం టికెట్లు కేటాయించి వాటిని అమలుపరిచే విధంగా చేశాడు.
ప్రధాన మంత్రిగా..
రాజీవ్ గాంధీ మరణానంతరం, కాంగ్రెస్ పార్టీ పీవీ నరసింహారావు సామర్థ్యాన్ని గుర్తించి దేశ ప్రధానమంత్రిగా నియమించింది. తద్వారా దేశ చరిత్రలోనే మొదటిసారి గాంధీ, నెహ్రూ కుటుంబం నుంచి కాకుండా ఒక తెలుగువాడు, దక్షిణ భారతదేశం నుంచి ప్రధానమంత్రి పదవి చేపట్టిన వ్యక్తిగా గుర్తింపు పొందాడు. పీవీ
బాధ్యతలు చేపట్టక ముందు భారతదేశంలో ఒక రకమైన రాజకీయ అనిశ్చితి నెలకొని ఉంది. అటువంటి పరిస్థితులలో ఐదు సంవత్సరాలు ఎటువంటి అంతరాయం లేకుండా ప్రభుత్వాన్ని నడిపించారు. దీన్నిబట్టి పీవీ నరసింహారావు రాజకీయ చతురతను అర్థం చేసుకోవచ్చు.
సంస్కరణల ఆద్యుడిగా..
పీవీ తీసుకున్న నిర్ణయాలలో 1991లో ప్రవేశపెట్టిన ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ, సరళీకరణ విధానం అత్యంత ప్రాధాన్యమైనవి. ఆరోజు తాను అమలుపరిచిన విధానం మూలంగా ఈరోజు మనం మంచి ఫలితాలను అనుభవిస్తున్నాం. తాను ముందుచూపుతోనే భారతదేశాన్ని ప్రపంచంతో అనుసంధానం చేయడం, ప్రభుత్వ భాగస్వామ్యంతోపాటు ప్రైవేటు వ్యక్తులను, ప్రైవేటు సంస్థలను పెట్టుబడులు పెట్టేవిధంగా ప్రోత్సహించడం ద్వారా మంచి ఫలితాలను సాధించడం జరిగింది. అదేవిధంగా, ప్రభుత్వ అనుమతుల విషయంలో సరళీకరణ విధానాన్ని అమలు పరచడం పారిశ్రామిక అభివృద్ధికి చాలా దోహదపడింది. భారతదేశాన్ని దాదాపు ఏకాంత స్థితి నుంచి ప్రపంచ ఆర్థిక శక్తిగా మార్చింది.
ఈరోజు భారతదేశం ప్రపంచ దేశాలతో అన్ని విషయాలలో దీటుగా సమానమైన పోటీని అందిస్తుందంటే, ఆ ఘనత ఆ రోజున పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయం వల్లనే సాధ్యపడిందని చెప్పవచ్చు. భారతదేశ 11వ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం పీవీ నరసింహారావును రాజకీయ వ్యవస్థ కంటే దేశమే పెద్దదని నమ్మిన దేశభక్తిగల రాజనీతిజ్ఞుడని అభివర్ణించాడు. పీవీ నరసింహారావు కాలంలో రాజకీయ భేషజాలకు పోకుండా దక్షత కలిగిన వాజ్‌పేయిని యుఎన్ఓకు పంపడంలో ఆయన రాజకీయ పరిణతిని గమనించొచ్చు. అటువంటి రాజకీయ సంస్కృతి ప్రతి రాజకీయ పార్టీకి చాలా ముఖ్యం. ఈ తరం రాజకీయ నాయకులు పీవీ నరసింహారావును ఆదర్శంగా తీసుకోవాలి.
- డా. ఏ. శంకర్, డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్, ఐలమ్మ మహిళా వర్సిటీ-